Saturday, May 29, 2010

మళ్ళీ ఫూల్స్ అయిన మెగా ఫాన్స్!



చిరంజీవి, మోహన్ బాబుల మధ్య వైరం గురించి ఇపుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి మధ్య ఎంతో కాలంగా సాగుతున్న ప్రత్యక్ష, పరోక్ష మాటల యుద్ధం అనేక వేదికల సాక్షిగా చూస్తూనే ఉన్నాం. అలాగే దాసరి నారాయణ రావు, చిరంజీవి మధ్య సంబంధాలు కూడా ఏమంత బాలేవు. చిరంజీవి పార్టీ పెడితే అతని పార్టీపై ప్రజలకు చులకన భావం ఏర్పడేలా తన వంతు కృషి చేసారు దాసరి. మేస్త్రి సినిమాలో చిరంజీవిపై ఆయన సంధించిన వ్యంగ్యాస్త్రాలను గురించి మెగా అభిమానులు ఎన్నటికి మరిచిపోలేరు. సందు దొరికితే చిరంజీవి పై కారు కూతలు కూయడంలో మోహన్ బాబు దిట్ట.
అయితే ఎన్ని సార్లు దాసరి, మోహన్ బాబు తనపై మాటల దాడికి దిగినా చిరంజీవి మాత్రం తనదైన శైలిలో నొప్పింపక తానొవ్వక పద్ధతినే పాటించారు. దాసరి తనకు వ్యతిరేకంగా సినిమా తీస్తున్నప్పుడు కూడా చిరంజీవి దాసరితో సత్సంబంధాలు ఉండాలనే చూసారు. అయితే మెగాస్టార్ అభిమానులు మాత్రం దాసరి, మోహన్ బాబుల మీద ఎంతో కోపం పెంచుకున్నారు. అనవసరంగా, అన్యాయంగా తమ అభిమాన కథానాయకుడిని మాటలు అనడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. ఇప్పటికీ వారిద్దరూ పేరు చెబితే అభిమానులు మంది పడతారు. అయితే ఇవన్నీ పట్టని చిరంజీవి 'ఝుమ్మంది నాదం' ఆడియో వేడుకకి వెళ్లి మోహన్ బాబు, దాసరితో 'స్నేహబంధాన్ని' ఘనంగా చాతుకుని వచ్చారు. ఈ వేడుకకి చిరంజీవిని, బాలయ్యని మోహన్ బాబు ఆహ్వానించడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా... మోహన్ బాబు ఎంతకాలం చిరంజీవితో సఖ్యంగా ఉంటాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే? ఈ స్నేహం కేవలం ఆ ఒక్క వేదికకే పరిమితం అయి మరోసారి మోహన్ బాబు చిరుపై నోరు పారేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఈ సినీ పాలిటిక్స్ మధ్య నిరంతరం ఫూల్స్ అవుతున్నది మాత్రం అభిమానులే అన్న దాంట్లో సందేహం అక్కర్లేదు.

1 comment:

  1. దీనిలో ఫూల్స్ అవ్వాల్సిందేముందండీ గణేష్ గారూ?

    నవ్వుతూ మాట్లాడుకున్నంత మాత్రాన ఏదో సఖ్యత ఉన్నట్టు కాదనుకుంటున్నా నేనైతే ...

    ReplyDelete